Lord Shiva: శివుడు నిరాకరుడు అంటారు. కానీ కొన్ని చోట్ల శివునికి ఆకారం ఉంది. చాలా అరుదుగా మాత్రమే శివుడు విగ్రహ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. అందుకే ఆ క్షేత్రాలు ప్రత్యేకంగా విశిష్ట స్థానాన్ని సంతరించుకున్నాయి. ఇక ఇప్పడు మనం చెప్పుకునే శివలింగం ఇంకా ప్రత్యేకమైనది. తవ్వి తీస్తుంటే, శివుని లీలు అపారంగా బయటికి వస్తున్నాయి కదా. ఇంతకీ మనం చెప్పుకోబోయే శివుడు ఏ రూపంలో, భక్తులను కటాక్షిస్తున్నాడో చూద్దాం పదండి.
పశుపతినాధ్ దేవాలయం:
జ్యోతిర్లింగాలలో ఓ పశుపతి నాధ్ దేవాలయం ఉంది. కానీ, మనం చెప్పుకునే పశుపతి నాధుడు వేరు. మధ్య ప్రదేశ్ లో ఈ పశుపతి నాధుడు మనకు దర్శనమిస్తాడు. రాజస్థాన్ సరిహద్దుల్లో మండాశూర్ అని పిలవబడు శివాలయంలో ఓ అరుదైన శివలింగం విశేషంగా ఆకర్షిస్తుంది. ఎన్నో రకాల శివలింగాలను గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కానీ, ఈ తరహా శివలింగం నిజంగా అద్భుతమనిపిస్తుంది.
అష్టముఖ శివలింగం..
శివుడు ఇక్కడ అష్ట ముఖాలతో దర్శన మిస్తాడు. అదేంటీ, ఒక్క ముఖంతోనే శివుడు కనిపించడం చాలా అరుదు. ఏకంగా అష్టముఖాలా.? అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ ఇది నిజంగా ఆశ్చర్యకరమైన దృశ్యమే మరి. అందుకే చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు.
అపురూపమైన శివయ్య రూపం..
ఎక్కడైనా శివుడు పానవట్టం మీదే ఉంటాడు. కొన్ని చోట్ల పానవట్టం లేకపోతే లేకపోవచ్చు. స్వయంభు లింగాల్లో.. కానీ, ఇక్కడ కూడా పానవట్టం మీదున్న శివలింగమే మనకు కనిపిస్తుంది. కానీ, ఈ లింగాకృతిలో ఎనిమిది ముఖాలు దర్శనమిస్తాయి. అచ్చు చతుర్ముఖుడు బ్రహ్మ మాదిరి అన్నమాట. నాలుగు ముఖాలు పైనా, నాలుగు ముఖాలు కిందా నాలుగు దిక్కులా విస్తరించి ఉంటాయి. శిఖరం చివరి భాగంలో లింగాకారం కనిపిస్తుంది. మొత్తంగా 15 అడుగుల అందమైన అపూర్వమైన విగ్రహమిది. అందుకే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
ఆలయ చరిత్ర..
సుమారు ఐదారు శతాబ్ధాల క్రితం ఈ ఆలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. వెయ్యేళ్ల క్రితమే, మహాకవి కాళిదాసు ఈ ఆలయం గురించి తన రచనల్లో ప్రస్థావించారట. ఇక్కడి శివుని ఎనిమిది ముఖాలకూ ఎనిమిది పేర్లు కూడా ఉన్నాయి. , భవ, పశుపతి, మహాదేవ, ఇసానా, రుద్ర, శర్వ, ఉగ్ర, అసానీ అని ఎనిమిది పేర్లతో శివున్ని కొలుస్తారు. ఎనిమిది ముఖాలతో ఉన్న ఈ మూర్తిని అష్టముఖ శివుడు, అష్టమూర్తి అని కూడా పిలుస్తారు.
దేశంలోనే అతి పెద్ద గంట..
దేవాలయానికి వెళ్లే ముందు స్వామీ నీ భక్తుడిని నేను వచ్చాను.. అని తెలియచెప్పేందుకు చిహ్నంగా గర్భ గుడికి బయట గంటను వేలాడదీస్తారు. ఆ గంటను మోగించి స్వామికి నమస్కారం చేసుకుంటారు భక్తులు. ఈ గుడిలోనూ అలాంటి గంట ఒకటి ఉంది. కానీ, చాలా ప్రత్యేకమైనది. అన్ని ఆలయాల్లో ఉన్న గంట మాదిరి కాదిది. చాలా చాలా పెద్ద గంట. దేశంలోనే అతి పెద్ద గంటగా చెబుతారు. ఇదే ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. దీన్ని తయారు చేయించడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టిందని ఆలయ చరిత్రలో రాసుంది. ఇండోర్ నుండి 200 కిమీల దూరంలో ఈ అద్భుతమైన శివాలయం కొలువై ఉంది.