Black cat :ఏదైనా పని మీద బయటకు వెళ్లేటపుడు నల్ల పిల్లి ఎదురొస్తే.. అపశకునం అని మన తెలుగు వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనాలు నమ్ముతారు. ఈ సంప్రదాయం కేవలం మనదేశానికి మాత్రమే చెందిన మూడాచారం అనుకోవడానికి వీలు లేదు. యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా.. నల్ల పిల్లి ఎదురు వస్తే.. అనుకున్న పనులు జరగవని బలంగా విశ్వసిస్తారు.
మధ్య యుగం నుంచే మొదలైంది….
మధ్య యుగ కాలం ముందు వరకు అన్ని జంతువుల మాదిరిగానే నల్ల పిల్లులు కూడా ఉండేవట. కానీ మధ్యయుగ కాలంలో నల్ల పిల్లులకు చెడు కాలం దాపురించింది. దుష్ట శక్తులను తొలగించడానికి, చెడు సంకేతాను పారద్రోలడానికి, దుష్ట శక్తులను వశపరుచుకోవడానికి నల్ల పిల్లులను బలిచ్చే సంప్రదాయం మధ్య యుగ కాలం నుంచి మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే మధ్య యుగ కాలానికి మునుపు నల్ల పిల్లులను ప్రస్తుతం చూస్తున్న విధంగా కాకుండా వేరేలా చూసేవారని అర్థం. కానీ క్రమ క్రమంగా మధ్య యుగ కాలం నుంచి నల్ల పిల్లంటే దుష్ట శక్తులకు నిలయమని, అది ఎదురొస్తే అపశకునాలు జరుగుతాయని బలంగా విశ్వసించడం మొదలెట్టారు. కేవలం సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలోనే కాకుండా యురోప్, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
black cat
17 సంవత్సరాల పాటు అరిష్టమట…
ఇంటి పరిసరాల్లో నల్ల పిల్లి గనుక మృతి చెందితే.. 17 సంవత్సరాల పాటు దురదృష్టం వెంటాడుతుందని మన దేశంలో ప్రజలు భావిస్తారు. అంతే కాకుండా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లే ముందు కానీ తోవలో కానీ నల్ల పిల్లి ఎదురొస్తే.. ఆ పనిని వాయిదా వేసుకుని మరీ.. తిరిగి వెనక్కు వస్తుండటం మనం అనేక సందర్భాల్లో చూస్తాం. పని లేటయినా మంచిదే కాని నల్ల పిల్లి ఎదురు వచ్చిందని పని మానుకుని కూర్చుంటారు మన దేశంలో..
అక్కడ నల్ల పిల్లిని అదృష్టంగా భావిస్తారట…
black cat
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో నల్ల పిల్లి ఎదురొస్తే.. అరిష్టమని భావిస్తే… కొన్ని దేశాల్లో నల్ల పిల్లిని అదృష్ట చిహ్నంగా భావిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. నల్ల పిల్లిని అదృష్టంగా భావించే వారిలో మొదట చెప్పుకోవాల్సింది ఈజిప్ట్ వాసుల గురించి… దానికి కారణం కూడా లేకపోలేదు ఈజిప్టు వాసులు ఆరాధించే వెస్ట్ అనే దేవత రూపం నల్ల పిల్లి తల కలిపి మనిషి శరీరంతో ఉంటుందట.. అందువల్లే ఈజిప్టు వారు నల్ల పిల్లిని అంతలా ఆరాధిస్తారు. ఆరాధించడమే కాకుండా ఇష్ట జంతువుగా అతిగా ప్రేమిస్తారు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. సూర్యుడి కిరణాలు నల్ల పిల్లుల కళ్లల్లో నిక్షిప్తమై ఉంటాయని వారు బలంగా విశ్వసిస్తారు. ఆ కారణం చేతే.. నల్ల పిల్లుల కళ్లు మెరుస్తాయని వారి నమ్మకం. అంతే కాకుండా యునైటెడ్ కింగ్ డమ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నల్ల పిల్లి ఎదురొస్తే.. శుభం కలుగుతుందని, అనుకున్న పనులు సజావుగా సాగుతాయని నమ్ముతారు. పూర్వకాలంలో బ్రిటన్ ను పాలించిన చక్రవర్తి చార్లెస్ –1 వద్ద ఓ నల్ల పిల్లి ఉండేదట. అది ఒక రోజు చనిపోవడంతో తన అదృష్టం పోయిందని ఆ రాజు బాధపడ్డాడట. అతను అనుకున్న విధంగానే నల్ల పిల్లి చనిపోయిన మరునాడే తన రాజ్యాన్ని కోల్పోవడంతో పాటు ఆ రాజు జైలు పాలయ్యాడట. అప్పటి నుంచి బ్రిటన్ లో ఈ సంప్రదాయం అలవడింది. స్కాట్లాండ్ వాసులు కూడా నల్ల పిల్లిని శుభసూచకంగా భావిస్తారట.