Udupi Sri Krishna Temple: నిష్కల్మషమైన భక్తికి సాక్షాత్తూ భగవంతుడు కూడా లొంగిపోతాడు.. అనే దానికి నిదర్శనంగా ఎన్నో కథలు పురాణాల్లో చెప్పగా తెలుసుకున్నాం. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం వాటన్నింట్లోకీ ప్రత్యేకమైనది. తన భక్తుడి కోసం భగవంతుడు తన దిశనే మార్చేసుకున్న క్షేత్రమిది. ఏంటా క్షేత్రం.? ఎక్కడుందీ.? ఎవరా భక్తుడు.? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.? అయితే, పదండి అస్సలేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లిపోదాం.
ఉడిపి శ్రీ కృష్ణ భగవానుడి చరిత్ర:
కృష్ణుడి ఆలయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఉడిపి కృష్ణ దేవాలయం. ఈ ఆలయంలోని దర్శనమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ ఆలయంలోనైనా మూల విరాట్టును గర్భాలయం ఎదురుగా నిలబడి దర్శించుకుంటాం. కానీ, ఈ ఉడిపి క్షేత్రంలో మాత్రం ఓ కిటికీ గుండా మాత్రమే స్వామిని దర్శించుకోవాలి. దాన్నే గవాక్ష దర్శనంగా పిలుస్తారు.
మధుర నుండి రేపల్లె, తర్వాత ద్వారక.. ఇలా కృష్ణుడికి సంబంధించి అన్ని విషయాలూ తెరచిన పుస్తకమే. అందరికీ తెలిసిన విషయాలే. అయితే, ఈ ఉడిపి కథ ఏంటీ.? ఇంతకీ అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఉడిపి కృష్ణ దేవాలయం ఎక్కడుంది.?
బెంగుళూర్ కి సుమారు 500 కిమీ ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నాయా.? అనిపించేంత ఎత్తైన చెట్లు, మెల్ల మెల్లగా పిల్లగాలి సందడి చేసే సముద్రపు హోరు.. ఇలాంటి ఆహ్లాదమైన ప్ర కృతి మధ్యలోంచి ఈ ఉడిపి క్షేత్రానికి చేరుకోవాలి. అబ్బ.. ఎంత బాగుంటుందో కదా.. అనుకుంటున్నారా.? నిజంగానే అదో అద్భుతమైన ప్రపంచం. సుందరమైన అనుభూతి. ఆ ప్ర కృతి సోయగాలకు ఎంత ఎలాంటి మనసైనా పులకించక మానదు. కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్ధం.. ఆ ఆకర్షణ మాదిరిగానే ఆయనను చేరుకునే ఈ ఉడిపి క్షేత్రం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
దక్షిణ కర్ణాటకలోని మంగుళూరుకు సుమారు 60 కిమీల దూరంలో ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఉడిపి క్షేత్రం ఉంది. కేరళ సాంప్రదాయంలో ఈ క్షేత్రం నిర్మించబడింది. ఈ క్షేత్రంలోని కృష్ణుడి విగ్రహం దాదాపు 800 ఏళ్ల క్రితం నాటిదని అంటారు. నిజానికి ఇది పుణ్య క్షేత్రం కాదు. ఇది ఒక మఠం. మఠం కాస్తా, పుణ్య క్షేత్రంలా ఎలా మారింది.?
అందుకు ఓ పురాణ గాధ ఉంది.
మధ్వాచార్యల వారు ఈ మఠాన్ని స్థాపించారట. ఇదే మఠంలో ఎంతో మంది శిష్యులకు ఆయన విద్యా బోధన చేస్తూండేవారట. ఒకరోజు, కలపతో నిండిన ఓడ ఒకటి వర్తకం నిమిత్తం సముద్రం గుండా వెళ్తుండగా, పెద్ద తుఫాను వచ్చి ఆ ఓడ మునిగిపోయిందట. అలా మునిగిపోయిన ఓడలో కలపతో పాటు, చందనంతో కూడిన కృష్ణ విగ్రహం ఒకటి కలిసిపోయిందట. ఆ విగ్రహం కూడా సముద్రంలో మునిగిపోయిందట. అప్పుడు మధ్వాచార్యల వారు తన దివ్య దృష్టితో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారట. అలా ఇక్కడ స్వామి వారు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.
విలక్షణ దర్శనం..
ఏ ఆలయాల్లోనూ లేని విధంగా ఈ ఆలయంలోని మూల విరాట్టును దర్శించుకోవడం చాలా వింతైన అనుభూతినిస్తుంది. ఒక కిటికీ గుండా స్వామిని దర్శించుకోవాలి. దాన్ని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో సింహ ద్వారం తూర్పు వైపుకే ఉన్నప్పటికీ, స్వామి వారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. కనక దాసు అనే భక్తుడి కారణంగా స్వామి ఇక్కడ పశ్చిమాభిముఖంగా వెలిశారని అంటారు. చేతిలో కవ్వం, పిల్లనగ్రోవితో బాల కృష్ణుడి రూపంలో చాలా ముచ్చటగా కనిపిస్తాడు స్వామి గర్భాలయంలో.
విశిష్ట పూజలు..
ఇక్కడ జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ప్రత్యేక విశిష్టత ఉంది. విఠల్ పిండి అనే పేరుతో కృష్ణుడి మట్టి విగ్రహాం చేసి, బంగారు రధంపై ఊరేగిస్తారు. ఉత్సవం అనంతరం, ఆ మట్టి విగ్రహాన్ని మధ్వ సరోవరంలో నిమజ్జనం చేస్తారు. ఈ రధోత్సవం చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఉత్సవ సమయంలో స్వామి వారు ఊరేగే ఈ బంగారు రధాన్ని బ్రహ్మ రధంగా అభివర్ణిస్తారు భక్తులు.