Ekalavya: బోయ కుటుంబానికి చెందిన ఏకలవ్వుడు.. ద్రోణాచార్యుని గురువుగా భావించి, ఆయనకు తెలియకుండానే విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ విషయం తెలుసుకున్న ద్రోణా చార్యుడు కోపంతో గురుదక్షిణగా బొటనవేలు కోరి, ఏకలవ్యున్ని విలువిద్యకు దూరం చేశాడని మనం చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. సినిమాల్లోనూ చూసేశాం. అయితే, విలువిద్యలో బొటనవేలు కీలక పాత్ర పోషిస్తుంది. బొటనవేలు తీసేస్తే, ఆయన విలువద్యకు పనికి రాడనే నెపంతోనే ద్రోణుడు కావాలని ఆ కోరిక కోరాడనీ, అనుకుంటాం. కానీ, ద్రోణుడి కోరిక వెనక రహస్యం మరోటి ఉంది. అలాగే, ద్రోణుడు భావించినట్లుగా ఏక లవ్యుడు ఆ తర్వాత విలువద్యకు దూరం కాలేదు. అదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఎవరు.? ఎందుకు పట్టుదలగా విలువిద్యను నేర్చకున్నాడు.?
బోయ కులానికి చెందిన రాజు కొడుకు ఏక లవ్యుడు. బోయ కులస్థుడయినప్పటికీ, ఏక లవ్యుని తండ్రి హిరణ్య ధన్యుడు. జరా సంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు. అందువల్ల యుద్ధంలో పాల్గొని వీర మరణం పొందాడు. తండ్రి మరణంతో ఏక లవ్యుడు చిన్నతనంలోనే తన తెగకు రాజయ్యాడు. చిన్న తనం నుండీ తండ్రి వద్ద విలువిద్యలోని మెలకువల్ని నేర్చుకున్న ఏకలవ్యుడు రాజు కావడంతో, ఆ విద్యలో మరింత శిక్షణ తీసుకోవాలని భావించి మంచి గురువును వెతక సాగాడు. ఆ క్రమంలోనే అఖండ విలువిద్యా నేర్పరి ద్రోణాచార్యుడు గురించి తెలుసుకుంటాడు. ఆయన వద్దకు వెళ్లి విలువిద్యను నేర్పపని అడగ్గా, తాను క్షత్రియులకు మాత్రమే విలువిద్య నేర్పిస్తానని ద్రోణుడిని తిరస్కరిస్తాడు. దాంతో ఆయనే తన గురువని భావించిన ఏక లవ్యుడు, మట్టితో ద్రోణుని బొమ్మను తయారు చేసుకుని, అక్కడే విలు విద్యలో నైపుణ్యం సంపాదిస్తాడు. అదే అడవిలో మరో పక్కగా అర్జునాది పాండవులు కూడా విద్యనభ్యసిస్తుండడంతో, ఒకసారి ఆట విడుపుగా పాండవులను అడవిలోకి వేటకు వెళ్లమని ఆదేశిస్తాడు ద్రోణుడు. వారితో పాటే ఓ అడవి కుక్క కూడా వెళుతుంది. గుంపు నుండి తప్పిపోయిన ఆ అడవి కుక్క ఏకలవ్యుడున్న ప్రాంతానికి వెళ్లి గట్టిగా అరుస్తుండడంతో, దాని నోరు మూసేందుకు ఏకలవ్యుడు ఏడు బాణాల్ని ఒకే సారి సంధిస్తాడు. ఆ బాధను తాళలేక ఆ కుక్క ద్రోణా చార్యుని వద్దకు వెళ్లిపోతుంది. ఆ సంఘటన చూసి అంతా ఆశ్చర్యపోతారు. అప్పటికి ఐదు బాణాలు ఒకేసారి సంధించగల సామర్ధ్యం ఉన్న ఒకే ఒక్కడు అర్జునుడు మాత్రమే. అలాంటిది అర్జునున్నే మించిపోయిన ఆ నేర్పరి ఎవరా.? అని ఆరా తీయగా, ఏకలవ్యుని గురించి తెలిసి, ద్రోణుడు అక్కడికి వెళ్లి గురు దక్షిణ అడుగుతాడు. గురు భక్తిని చాటుకున్న ఏక లవ్యుడు మారు ఆలోచించకుండా, తన బొటనవేలు కోసిచ్చేస్తాడు. అక్కడితో ఏకలవ్యుడి చరిత్రి అయిపోయిందనుకుంటాం. కానీ, ఇంకా ఉంది.
గురుదక్షిణ అడగడం వెనక ద్రోణుడి ఆంతర్యమేంటంటే..
కాల క్రమంలో ఏకలవ్యుడు అధర్మం పాలిట నిలబడి, ఊహించని అనర్ధానికి కారణమవుతాడనీ, ముందుగానే ఊహించాడు కాబట్టి, లోక కళ్యాణం కోసమే ద్రోణుడు ఆ కోరిక కోరాడు. కానీ, ద్రోణుడు ఊహించింది జరగలేదు. ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్లతోనే విలువిద్యను కొనసాగించాడు. యుద్ధంలో భీకరంగా పోరాడాడు. కానీ, అధర్మం పక్షాన నిలబడ్డాడు. ఏకలవ్యుడి సాయంతో జరాసంధుడు క్రిష్ణుడి మీదకి సేనలను పంపేవాడు. క్రిష్ణుడిపై గెలవాలన్న కోరిక మాత్రం జరాసంధుడికి తీరలేదు. ఏకలవ్యుడు ముందుండి సేనలను తునా తునకలు చేసేవాడు. ఆ యుద్ధం కారణంగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దాంతో డైరెక్టుగా క్రిష్ణుడే యుద్ధ భూమిలోకి దిగి, ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు. గురువు కాదన్నా, విలువద్యలో అపారమైన నైపుణ్యం సాధించి, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి చరిత్రలో తనకంటూ ఓ గొప్ప పేజీని లిఖించుకున్న ఏక లవ్యుడు చివరికి ధర్మ, అధర్మాల విచక్షణ లేకుండా, అధర్మం పక్షాన నిలబడ్డాడు. ఎంతటి ప్రతిభ ఉన్నా, అధర్మం పక్షాన నిలబడితే, చివరికి నాశనం తప్పదన్న నీతి మనకు ఏకలవ్యుని కథ ద్వారా తెలుస్తుంది.