Jagannatha Temple Puri: ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ దేవాలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శాస్త సాంకేతిక రంగం ఎంతలా కొత్త పుంతలు తొక్కుతున్నా.. హిందూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని మిస్టరీలను ఛేదించడం, ఏ ఆధునిక శాస్త్ర పరిజ్నానం వల్ల కూడా కావడంలేదు. ఎందుకిలా.? అదంతే. అసలు దేవుడే లేడని వాదించేవారికి సవాల్ విసిరే ఎన్నో అంశాలు.. కాదు కాదు లక్షలాది, కోట్లాది విశేషాలు హిందూ మతంలో కనిపిస్తాయి. ‘మూఢ నమ్మకం’ అని కొట్టిపారేయడం ద్వారా హిందూ మతాన్ని కించపర్చే సోకాల్డ్ మేధావులకు, హిందూ మతంలోని అద్భుతాలకు సంబంధించి తమ శాస్త్ర, సాంకేతిక రంగం ఛేతులెత్తేసిన వైనం మాత్రం కనిపించదు. అలాంటి చాలా అద్భుతాల్లో పూరి జగన్నాథ్ దేవాలయంపై ఎగిరే జెండా ఒకటి.
పూరి జగన్నాథుడి దేవాలయంపై జెండా ప్రత్యేకత ఇదీ..
అద్భుత శిలా సంపదకు పూరి జగన్నాథ్ దేవాలయం నెలవు. నిజానికి, విదేశీయుల దండయాత్రల కారణంగా పూరి జగన్నాథ్ దేవాలయం కొంతమేర ధ్వంసమైనప్పటికీ, ఆ దేవాలయం ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ అలాగే వుంది. దేవాలయంపైన ఓ జెండా వేలాడుతుంది. ఆ జెండాని అక్కడ వేలాడేసేందుకు ప్రత్యేకంగా పైకి ఎక్కాల్సి వుంటుంది. ఇది చాలా భక్తితో చేయాల్సిన పని. దేవాలయంపై సుదర్శన చక్రాన్ని తలపించే ఓ నిర్మాణం వుంటుంది. ఆ చక్రాన్ని దాపుగా చేసుకుని జెండాని కడతారు.
జెండా ఎందుకు అటు వైపు మాత్రమే ఎగురుతుంది.?
మామూలుగా ఏ జెండా ఎగురవేసినా.. గాలి దిశను బట్టి.. ఆ జెండా అటువైపుగా వాలుతుంది. కానీ,పూరి జగన్నాథ్ దేవాలయం ప్రత్యేకత వేరు. ఈ దేవాలయం మీద జెండా, గాలి ఎటువైపు వీస్తుందో దానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది. ఈ అద్భుతాన్ని స్వయంగా చూసినవారికి.. జీవితాంతం కళ్ళముందు అదే మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటుంది. అంతలా భక్తి పారవశ్యంలో మునిగిపోతారు ఎవరైనా ఈ అద్భుతాన్ని చూస్తే.
చాలా ప్రయోగాలు జరిగాయ్ గానీ..
జెండా అలా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగరడంపై చాలా ప్రయోగాలు జరిగాయి. చాలా సిద్ధాంతాల్ని కూడా చెప్పారు కొందరు మేధావులు. కానీ, ఆ స్థాయిలో.. ఆ ఎత్తులో ఎక్కడ ఏ జెండా ఎగురవేసినా.. అది మామూలుగానే వుంది తప్ప, దేవాలయ జెండా తరహా ప్రత్యేకతను సంతరించుకోలేకపోయింది. పైగా, దేవాలయంపై జెండా చుట్టూ పక్షుల సంచారం అస్సలు వుండదు. ఇది ఈ ఆలయానికి సంబంధించిన ఇంకో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలపైన పక్షులు వాలడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ, పూరి జగన్నాథ్ దేవాలయంపై అలాంటివి కనిపించవు. అసలు దేవాలయంపైన పక్షుల సంచారమే వుండదు.
గోపురం నీడ కూడా కనిపించదిక్కడ..
పూరి జగన్నాథ్ దేవాలయం తాలూకు మరో ప్రత్యేకత ఏంటంటే, ఏ సమయంలోనూ గోపురం నీడ కింద పడదు. ఆ నీడ మనకు కనిపించదు. దేశంలో ఎక్కడా ఏ దేవాలయంలోనూ లేని వింత ఇది. ఇవే కాదు, పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి చాలా చాలా వింతలున్నాయి. ఆ వింతల్ని ఇంకోసారి తెలుసుకుందాం. భక్తితో చూసేవారికి ప్రతీదీ అద్భుతమే. మేధావులమనుకుని వంకర కోణంలో చూస్తే.. అన్నీ వంకరగానే కనిపిస్తాయిగానీ. వాస్తవాల్ని అంగీకరించలేకపోవడం కూడా మూఢత్వమేనని సోకాల్డ్ మేధావులు తెలుసుకోవాల్సిందే.. అని ఇలాంటి అద్భుతాల్ని చూసినప్పుడు అనిపిస్తుంటుంది.