Malluru Narasimha Swamy Temple : భారతదేశం ఆలయాల నెలవు. కాగా, మన పూర్వీకులు రకరకాల వాస్తు శైలి, శిల్పకళలతో టెంపుల్స్‌ను నిర్మించారు. అలా మన పూర్వీకులు నిర్మించిన ఆలయాల్లో చాలా వరకు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాగా, ఆ ఆలయాల నిర్మాణ శైలి, అందులో ప్రతిష్టించబడిన విగ్రహ ప్రతిమలు, దేవుడి మహిహల రహస్యాలు కొన్నిటినీ ఇంకా ఛేదింలేకపోయారు పురావాస్తు పరిశోధకులు. ఇంకా పలు విషయాలపై ఔత్సాహిక పరిశోధకులతో పాటు పురావస్తు శాఖ వారు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..మనం తెలుసుకోబోయే ఆ ఆలయంలో స్వామి వారి విగ్రహాన్ని తాకి చూస్తే మానవ శరీరాన్ని తాకినట్లే అనిపిస్తుందట. మెత్తగా ఫీల్ కలిగే ఆ స్వామి వారి విగ్రహం ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆలయ క్షేత్రం ఉంది. గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం – భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఉండగా, పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
మల్లూరు హేమచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో పూర్వం మునులు తపస్సు చేశారట. వారికి ఇది మరో హిమాలయగా కనిపించేదని చరిత్రకారులు వివరిస్తున్నారు. ఈ క్షేత్రమంతా కూడా అర్ధచంద్రాకారంలో ఉండటం విశేషం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడని పెద్దలు చెప్తున్నారు.
Malluru Narasimha Swamy Temple
చోళ చక్రవర్తుల కాలం నాటి ఈ టెంపుల్ అత్యంత మహిమ కలదని భక్తుల నమ్మకం. శాతావాహన ప్రభువు దిలీపకర్ణికి కలలో స్వామి వారు కనిపించి తాను గుహలో ఉన్నాడని చెప్పడంతో టెంపుల్ నిర్మించారట. మహారాజు సైనికులతో తవ్వకాలు జరుపుతుండగా స్వామి వారికి గునపం గుచ్చుకుందట. అలా నాభిపైన గునపం గుచ్చుకోవడం వల్లే ఇప్పటికీ ఆ నాభి నుంచి ద్రవం బయటకు వస్తుంటుందని స్థానికులు చెప్తున్నారు. ఆ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఇకపోతే ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే..హేమచల లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం మానవ శరీరంలాగా మొత్తంగా ఉండటం ఆశ్చర్యం కలగజేస్తుంటుంది. స్వామి వారి విగ్రహాన్ని ఎక్కడ నొక్కి చూసినా మొత్తగా మానవ శరీరంలాగానే అనిపిస్తుందట. మానవులకు ఉన్న మాదరిగానే స్వామికి చాతి మీద రోమాలు కూడా ఉంటాయని, అవి అందరికీ కనిపిస్తాయని స్థానిక భక్తులు చెప్తుంటారు. ఇకపోతే స్వామి వారి నాభి(బొడ్డు) భాగం నుంచి ద్రవం కారుతుండగా, అది రాకుండా ఉండేందుకుగాను పూజారులు గంధం పూస్తుంటారని వివరిస్తున్నారు. ఇకపోతే స్వామి వారి నాభిలో ఉన్న గంధం ప్రసాదంగా భావిస్తుంటారు స్థానికులు. మల్లూరు హేమచల లక్ష్మీనరసింహా స్వామి వారి క్షేత్రాన్ని అప్పట్లో కాకతీయ రాణి రుద్రమ దేవి సందర్శించారని చరిత్రకారులు వివరిస్తున్నారు.