Ramappa Temple : సాధారణంగా ఆలయాలు ఏవైనా అందులో ఉండే దేవుడి పేరు మీద ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదాహరణకు వేములవాడ రాజన్న ఆలయం తీసుకుంటే…ఆ ప్రదేశంలోని టెంపుల్‌లో ఉండే దేవుడు రాజరాజేశ్వరి స్వామి వారు కాబట్టి వేములవాడ రాజన్న ఆలయం అని పిలుస్తుంటాం. కానీ, మనం తెలుసుకోబోయే ఈ ఆలయం మాత్రం అలా కాదండోయ్.. ఇది వెరీ స్పెషల్ టెంపుల్.. ఈ ఆలయానికి పేరు అందులో ఉన్న దేవుడిది కాకుండా ఆ టెంపుల్‌ను చెక్కిన శిల్పి పేరు పెట్టారు. అలా ఈ ఆలయం బాగా ఫేమస్ అవడమే కాదు… యునెస్కో వారు ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు కూడా. ఈ టెంపుల్ తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది.
మధ్యయుగంలో నిర్మించబడిన రామప్ప టెంపుల్‌ను ఇటీవల ఐక్యరాజ్య సమితి వారి యునెస్కో ఆర్గనైజేషన్ ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ టెంపుల్‌ను సుమారు 900 ఏళ్ల కిందట వరంగల్‌కు సమీపంలోని పాలంపేట ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసేందుకుగాను మన దేశంలోని ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ఇకపోతే ఈ టెంపుల్‌లో ఉండే భోళా శంకరుడు మహిమలు కలవాడని భక్తుల నమ్మకం. పరమ శివుడితో పాటు ఇతర అనేక దేవతలు కొలువు దీరి ఉంటారు. హిందువుల ఆరాధ్య దేవుడు అయిన పరమశివుడిని దర్శన భాగ్యం చేత మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి దేవ పాలనలో సైన్యాధిపతి రేచర్ల రుద్ర పర్యవేక్షణలో టెంపుల్స్‌ను రాజులు నిర్మించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రామప్ప పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉంటాయి. వాటికి దగ్గరలోని సరస్సు నుంచి నీళ్లు వెళ్తాయి.
Ramappa Temple
రామప్ప రుద్రేశ్వర ఆలయంలో శివలింగం కొలువై ఉన్నప్పటికీ ఈ పుణ్యక్షేత్రానికి శివాలయం అని కాకుండా రామప్ప అని పేరొచ్చింది. దానికి గల కారణం ఏమిటంటే..నాటి ఆలయ నిర్మాతలు దేవుడి పేరుకు బదులుగా శిల్పి పేరును హైలైట్ చేయాలని భావించారు.అలా దక్షిణ భారత దేశంలో శిల్పికి మంచి పేరు రావాలని భావించి.. టెంపుల్‌ను అత్యద్భుతమైన శిల్ప కళతో నిర్మించిన శిల్పి రామప్ప స్తపతి పేరు మీదుగా.. ‘రామప్ప ఆలయం’గా నామకరణం చేసినట్లు స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది. అలా ఆలయంలోపల పరమశివుడు, నంది, గణపతి ఇతర దేవతలు కొలువు దీరి ఉన్నప్పటికీ ఈ టెంపుల్.. రామప్పగానే విరాజిల్లుతోంది.
Ramappa Temple1
మధ్యయుగంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శివాలయంతో పాటు కటేశ్వర, కామేశ్వర ఇతర ఆలయాలు ఉన్నాయి. ఇకపోతే ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కోసం యూజ్ చేసిన ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. అవి నీటిపై వేస్తే తేలియాడుతాయి. ఈ విషయం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. శివలింగం, నంది, హిందూ పురాణాలకు సంబంధించిన అద్భుత శిల్పాలను శిల్పకారులు అత్యద్భుతంగా చెక్కారు. గర్భగుడిలోని శివలింగం నుంచి వచ్చే తరంగాల ద్వారా మానవాళికి మంచి జరగడంతో పాటు మనో వికాసం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.