కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్రలో ఓ ముశ్లిం గాధ కూడా ఉన్నట్లు మన పురాణాలు చెబుతాయి. పద్మావతీ దేవిని సాక్ష్యాత్తూ శ్రీనివాసుని భార్యగా మనం చెప్పుకుంటాం. కానీ, ఆయన భార్యల లిస్టులో ఓ ముస్లిం యువతి కూడా ఉన్నట్లు చాలా కొద్ది మందికే తెలుసు. ఆమె పేరే బీబీ నాంచారమ్మ. రంగనాధ స్వామికి బీబీ నాంచారమ్మను భార్యగా చెప్పుకుంటారు ముస్లిం. అందుకే, తిరుమలలోని దేవుని గడపలో రంగనాధ స్వామి ఆలయంలో, శ్రీనివాసుడి విగ్రహంతో పాటు, బీబీ నాంచారమ్మ నిలువెత్తు విగ్రహం కూడా మనం చూస్తాం.
అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు.?
నాంచియార్ అంటే ఓ తమిళ పదం. ఆ పదానికి భక్తురాలు అని అర్ధం. బీబీ అంటే భార్య అని అర్ధం. అలా ముస్లిం భక్తురాలైన నాంచియార్ ను అసలు పేరు సూర్తాణి. నిజానికి ఈమె తండ్రి మాణిక్ కాఫిర్ హిందువే అయినప్పటికీ, ముస్లిం రాజు అయిన అల్లా వుద్ధీన్ ఖిల్జీకి సేనాధిపతిగా ఉండడం వల్ల ముస్లిం మతం మార్చుకున్నాడు. అల్లా వుద్దీన్ ఖిల్జీకి మాణిక్ చాలా నమ్మకస్ధుడు కావడంతో, తన రాజ్య విస్తరణ బాధ్యతను మాణిక్ కాఫిర్ కు అప్పచెప్పాడు. ఆ క్రమంలో దక్షిణ భారతదేశం వైపు దండెత్తి వచ్చిన మాణిక్ కాఫిర్ తిరుమలలోని రంగనాధ స్వామి ఆలయాన్ని సందర్శించాడు. అక్కడి భక్తుల కోలాహలం చాలా ఎక్కువ ఉండడం, ఆలయంలోని రంగనాధ స్వామి ఆభరణాలు, విగ్రహం అత్యంత విలువైనదిగా భావించడంతో అక్కడి భక్తులను భయ భ్రాంతుల్ని చేసి, రంగనాధ స్వామి విగ్రహాన్నీ, స్వామి వారి నగలనూ అపహరించుకుని తీసుకెళ్లిపోయాడు. అలా తీసుకెళ్లిన రంగనాధ స్వామి విగ్రహం, మిల మిలా మెరుపులతో ఎంతో శోభాయమానంగా ఉండడం చూసి, ఆకర్షితురాలైన కూతురు సూర్తాణి అలియాస్ బీబీ నాంచారమ్మ, ఆ విగ్రహం తనకు కావాలని తండ్రిని కోరిందట.
కూతురు ముచ్చట తీర్చేందుకు ఆ విగ్రహాన్ని ఆమెకు ఇచ్చేశాడట మాణిక్. అప్పటి నుండీ సూర్తాణి ఆ విగ్రహానికి అభిషేకాలు చేయడం, పూజలు చేయడం, లాలి పాడి ఊయలూపి నిద్ర పుచ్చడం చేస్తూ, ఎంతో ప్రేమ పెంచేసుకుందట. ఇక్కడ తిరుమలలో రంగనాధుని విగ్రహం లేక, ఆలయం వెలవెలబోతుండడం చూసిన అర్చకులు ఆందోళన చెందుతూ, విగ్రహాన్ని తిరిగివ్వమని రాజు వద్దకు వచ్చి కాళ్లా వేళ్లా పడడంతో, కాస్త కరుణ చూపించిన మాణిక్ వారికి విగ్రహం తిరిగిచ్చేయాలనుకుంటాడట. కానీ, అప్పటికే ఆ విగ్రహంతో ప్రేమలో పడిపోయిన బీబీ నాంచారమ్మ అందుకు అంగీకరించకపోవడంతో, ఆమె నిద్ర పోయిన సమయం చూసి, మాణిక్ ఆ విగ్రహాన్ని అర్చకులకు తెచ్చిస్తాడట. తెల్లవారి ఆ విషయం తెలుసుకున్న బీబీ నాంచారమ్మ, తిరుమలకు బయలుదేరుతుందట. అక్కడే స్వామి సేవలో ఉండిపోయి, చివరికి స్వామిలోనే ఐక్యమవుతుందట.
అప్పటి నుండీ ముస్లిం ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడి భార్యగా భావించి శ్రీనివాసున్ని తమ అల్లుడిగా చేసేసుకున్నారు అక్కడి ముశ్లింలు. దాంతో ఉగాది నాడు తిరుమలలో ముస్లింలు ప్రత్యేక పూజలు చూపరులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే, బీబీ నాంచారమ్మ సాక్షాత్తూ భూదేవి, లక్ష్మీదేవి అవతారమనీ, కలియుగంలో వేంకటేశ్వర స్వామికి తోడుగా ఉండేందుకు బీబీ నాంచారమ్మగా అవతరించిందనీ కొందరు అంటుంటారు.
తిరుమల రంగనాధ స్వామి ఆలయంలో స్వామి వారితో పాటు, బీబీ నాంచారమ్మనిలువెత్తు విగ్రహం కూడా మనం దర్శించుకోవచ్చు.