Subramanian Swamy భారతీయ పురాణాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ సుబ్రహ్మణ్య స్వామి గురించి తప్పక తెలుస్తుంది. శివ పార్వతులకు రెండో కుమారుడిగా జన్మించిన ఈయనకు అన్న అయిన వినాయకుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు అనేక పేర్లతో పిలుస్తుంటారు. కుమార స్వామి, కార్తికేయుడు, స్కంధుడు, షణ్ముకుడు లాంటి పేర్లు ఈయనకు ఉన్నాయి.
తారకాసురుడు అనే రాక్షసుడి బాధను భరించలేక దేవతలు అందరూ కలిసి శివుడికి సతీ దేవి రూపంలో ఉన్న పార్వతి దేవికి పెళ్లి చేస్తారు. కానీ అనంతరం వారిలో కలిగిన సందేహాల వల్ల శివుడి తేజస్సు పార్వతిలో కాకుండా వేరే వారిలోకి చేరుతుంది. దీనికి శపించిన పార్వతీ దేవి దేవతలతో మీరంతా కలిసి నాకు పిల్లలు పుట్టకుండా చేశారు కాబట్టి ఇకపై భవిష్యత్ లో మీకు కూడా సంతానం కలగదని శపిస్తుంది. అందువల్లనే దేవతల సంఖ్య ఎప్పటి నుంచో పెరగకుండా అలాగే ఉందని పురాణాల్లో లిఖించబడింది. పార్వతీ దేవి శాపం మూలాన దేవతల సంఖ్య పెరగకుండా ఉండటం సబబే కాని వారి సంఖ్య ఎందుకు కాలం గడుస్తున్న కొద్ది తగ్గడం లేదని చాలా మందిలో సందేహం కలగక మానదు. దానికి కూడా పురాణాల్లో సమాధానాన్ని లిఖించారు. దేవలందరూ అమృతం తాగుతారు కాబట్టి వారికి చావనేదే ఉండదని చెప్పారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుళ్ల సంఖ్య పెరగలేదు, తగ్గలేదని పేర్కొంటారు. మరో విషయం ఏంటంటే.. సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన షష్టిని సుబ్రహ్మణ్య షష్టి, స్కంధ షష్టి అని పిలుస్తారు. ఈ షష్టి నాడు ఉపవాసం ఉండి స్వామి వారిని ఆరాధిస్తే సకల దోషాలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఆరు తలలతో పుట్టడంతోనే….
సుబ్రహ్మణ్య స్వామికి మరో పేరు షణ్ముకుడు. అలా ఎందుకు పిలుస్తారని చాలా మందిలో సందేహం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి జన్మించినపుడు అతడు ఆరు తలలతో జన్మించాడట. అందు వల్లనే ఈ స్వామిని షణ్మకుడు అని కూడా పిలుస్తారని పురాణాల్లో చెప్పబడింది. సుబ్రహ్మణ్య స్వామిని కైలాస శిఖరం దగ్గర శరవణం అనే పేరు గలిగిన రెల్లు పొదల్లో జన్మిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన వెంటనే కృత్తికలు అనే ముని కన్యలు తీసుకెళ్లి స్వామిని అపురూపంగా పెంచుతారు. ఇందువల్లే సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చిందని అందరూ చెబుతారు. ఆరు తలలతో జన్మించడం మూలానే షణ్ముకుడిగా స్వామి వారు కీర్తించబడుతున్నారు. అంతే కాకుండా శివ పార్వతులకు కుమారులు జన్మిస్తే తనకంటే గొప్ప వాడవుతాడని భావించిన ఇంద్రుడు శివపార్వతులకు కుమారులు పుట్టకుండా అగ్ని దేవుడిని పంపిచాడని చెబుతారు.
తారకాసురుడిని సంహరించిన స్వామి…
అసలు కుమారస్వామి జననం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమే తారకాసురుడనే రాక్షసుడిని సంహరించడం అని చాలా మంది చెబుతారు. బ్రహ్మ దేవుడి చేత వరం పొందిన తారకాసురుడు రెచ్చిపోతూ… దేవతలను ముప్పు తిప్పలు పెట్టసాగడు. మహా శివుడి ఆజ్ఞ మేరకు కుమారస్వామి వెళ్లి… తారకాసురుడితో తలపడతాడు. తారకాసురుడు కూడా జీవితం మీద ఆశ చావక సుబ్రహ్మణ్య స్వామితో తలపడతాడు. తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తాడు. తారకాసురుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామికి ఏ మాత్రం గాయాలు కాకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇక అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తనకు శివుడు ప్రసాదించిన ఆత్మ లింగాన్ని తారకాసురుడి మీద ప్రయోగిస్తాడు. దాంతో తారకాసురుడు నేల మట్టం అయి ప్రాణాలు వదులుతాడు. తారకాసురుడి అంతంతో దేవతలు చాలా సంతోషిస్తారు. సంతోషంగా సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ.. పొగుడుతారు.