Lord Shiva Temple: శివాలయాలకు సంబంధించి ఎన్నో వింతలు, విశేషాలూ.. కొన్ని సైన్సుకి అంతు పట్టినవి. మరికొన్ని ఎన్ని వందల ఏళ్లు గడిచినా అంతు పట్టని రహస్యాలుగా మిగిలిపోయాయి. అలాంటి ఓ అంతు పట్టని శివలింగ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శివలింగం రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుందట. అయితే, ఎంత పెరుగుతుంది.? ఎందుకు పెరుగుతుంది.? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయలేదట. ఎందుకంటే, అంత మహిమాన్వితమైన శివలింగం అది. అలా పరిశోధనలు చేయడం తమ భక్తిని అవమానపరచడంగా అక్కడి భక్తులు భావించడంతో, పరిశోధకులు ఎవ్వరూ అంతటి సాహసం చేయలేదని అంటుంటారు. ఇంతకీ ఈ పెరిగే శివాలయం ఎక్కడుంది.? అంటారా.? అది తెలుసుకోవాలంటే మనం పాకిస్థాన్ కి వెళ్లాల్సిందే.
పాకిస్థాన్ లోని సింధ్ రాష్ర్టంలో ఈ శివలింగం ఉంది. మొగల్ చక్రవర్తి అక్బర్ జన్మించిన ఉమర్ కోటలో ఈ శివలింగం ఉంది. పాకిస్థాన్ లో శివాలయమా.? అక్కడి ముశ్లింలు ఈ ఆలయాన్ని ఎలా ఉండనిచ్చారు.? అది కూడా హిందూ వ్యతిరేకి అయిన అక్బర్ కోటలో.? అంటే అదే ఆ శివలింగం ప్రత్యేకత. ఈ స్వామి అంత పవర్ ఫుల్ మరి. భారతదేశం నుండి పాకిస్థాన్ విడిపోకముందే ఈ శివాలయం అక్కడ వెలసింది. అప్పటి నుండీ ఇప్పటికీ అక్కడే భక్తులతో పూజలందుకుంటోంది. పాకిస్థాన్ నుండి విడిపోయాకా, చాలా మంది హిందువులు అక్కడి నుండి తరలి వచ్చేశారు. కానీ,కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇక ఉమర్ కోట విషయానికి వస్తే, పాకిస్థాన్ భూభాగంలో ఎక్కువమంది హిందువులున్న ప్రాంతంగా ఉమర్ కోటను పేర్కొంటారు. అందుకే అక్కడ కొన్ని వందల శివాలయాలూ, గురు ద్వారాలు ఉన్నాయని అంటారు. ఇక ఉమర్ కోటను అప్పట్లో అమర్ కోట అని పిలిచేవారట. కాలక్రమంలో అది ఉమర్ కోటగా మారింది.
శివలింగం ఎలా ఉద్భవించింది.?
ఇప్పుడు ఉమర్ కోట ఉన్న ప్రదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రిందట పచ్చిక మైదానాలు ఎక్కువగా ఉండేవట. అక్కడకు పశువులను కాచుకునేందుకు వెళ్లేవారికి ఈ శివలింగం కనిపించిందట. తమ పశువులు ప్రతీరోజూ ఆ శివలింగానికి క్షీరాభిషేకం చేస్తుండడం చూసి, అక్కడ శివలింగం ఉన్నట్లు గుర్తించారట. అప్పటి నుండీ ఆ శివలింగానికి పూజలు చేయడం మొదలు పెట్టారట. కాల క్రమంలో అది పెద్ద శివాలయంగా మారిందనీ అంటుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఈ శివాలయం ఉంది. రోజు రోజుకూ అక్కడి శివుడు పెరుగుతున్నాడని కనిపెట్టిన భక్తులు మరింత మహిమాన్వితంగా శివారాధన చేయడం మొదలు పెట్టారట. శివలింగం చుట్టూ ఓ వలయాన్ని గీశారట. ఆ వలయాన్ని దాటి ఇప్పటికీ శివలింగం పెరుగుతూనే ఉందట. అందుకే, పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాలన్నింట్లోనూ అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధికెక్కిన శివాలయంగా ఈ ఉమర్ కోట శివాలయాన్ని పేర్కొంటారు. మత వైషమ్యాలకు భిన్నంగా ఇక్కడ సాంస్ర్కతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. శివరాత్రి ఉత్సవాలను మన దేశంలోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఘనంగా నిర్వహిస్తారు. ఉమర్ కోట శివాలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు మరింత ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల నుండి హిందువులతో పాటు, పెద్ద ఎత్తున ముశ్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించడం మరో విశేషం.