Vaccine : ఇప్పటికే కొన్ని లక్షల మంది కొవిడ్-19 టీకా వేయించుకున్నారు. అయినా కోట్ల సంఖ్యలో క్యూలో వెయిటింగ్ చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇందులో డైట్ కీలక పాత్ర పోషిస్తుందని మర్చిపోవద్దు. ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారమే తీసుకోవాలని కొందరు చెబుతుండగా మరికొందరేమో నీళ్లు ఎక్కువ తాగాలని, నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫుడ్డు బెస్టు? ఏది వేస్టు? అనేది చూద్దాం..
కొవిడ్-19 టీకా వేయించుకోవటానికి ముందు, తర్వాత కూడా ఒంట్లో నీటి శాతాన్ని బాగా మెయిన్టెయిన్ చేయాలి. అంటే నీళ్లు ఎక్కువ తాగాలి. వాటర్ పర్సంటేజీ అధికంగా ఉండే పళ్లు తినాలి. ఇలా చేస్తే కరోనా వ్యాక్సిన్ కలిగించే ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించొచ్చు. తద్వారా టీకా కోర్సు పూర్తయ్యే దాక బెటర్ హెల్త్ సొంతం చేసుకోవచ్చు.
కొవిడ్ టీకా వేయించుకున్నాక కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇన్జెక్షన్ గుచ్చిన చోట నొప్పి వంటి చిన్నాచితక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో మందు తాగితే ఒంట్లోని నీరంతా బయటికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా సైడ్ ఎఫెక్ట్స్ మరింత పెరుగుతాయి. ఆల్కహాల్ వినియోగం శరీరంలోని వ్యాధి నిరోధకతను క్షీపింపజేస్తుందని ఒక స్టడీలో తేలింది. కాబట్టి మందుకి పూర్తిగా బంద్ పెట్టాలి.
ఆరోగ్యకరమైన తిండి తింటే కరోనా వంటి మహమ్మారులను జయించొచ్చని ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో పబ్లిష్ అయిన అధ్యయనం సూచిస్తోంది. కొవిడ్ టీకా వేయించుకోవాలనుకున్నాక ధాన్యాహారం (ముఖ్యంగా గోధుమ ఉత్పత్తులతో చేసిన ఫుడ్ ఐటమ్స్) తినటం మంచిది. ఎందుకంటే అందులో పీచు అధికంగా ఉంటుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది. దండిగానూ ఉంటుంది. ఆయిల్ ఫుడ్డు వెరీ బ్యాడ్.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక బాగా రెస్ట్ తీసుకోవాలి. అదే సమయంలో యాక్టివ్ గా కూడా ఉండాలి. దీనికోసం కొవ్వు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళన, నిద్రాభంగం వంటి సమస్యలు దరి చేరవు. కొవిడ్ టీకాకి ముందు, తర్వాత సైతం డైట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదని ‘‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’’ వివరించింది.