Ankita Shah పుట్టుక మన చేతుల్లో ఉండదు. కానీ బ్రతుకు మన చేతుల్లోనే ఉంటుంది. విధి చిన్నచూపు చూసిందని బాధపడుతూ, ఏడుస్తూ కూర్చునే కంటే ‘‘అయ్యో.. నేను ఈ రాత ఎందుకు రాశానా’’ అంటూ ఆ విధాతే విచారం వ్యక్తం చేసేలా మనం పట్టుదలతో ముందుకు కదలాలి. ఎదుటివాళ్లు మనల్ని చూసి జాలిపడకుండా మనల్ని చూసి నేర్చుకునేలా చెయ్యాలి. ఇవన్నీ చెప్పటానికి, రాయటానికి, చదవటానికి బాగానే ఉంటాయి అనుకోకండి. అంకితా షా అనే యువతి అవన్నీ చేసి చూపిస్తోంది. ‘ఆమెని అలా ఎందుకు పుట్టించానా’ అని ఆ దేవుడే బాధపడేలా చేస్తోంది. తనని చూసి నలుగురూ హ్యాట్సాఫ్ అనేలా కష్టపడుతోంది. ‘‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు..’’ అనే పాటకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
మన కాళ్ల మీద మనం నిలబడాలంటారు. అంటే అది రెండు కాళ్లు ఉన్నవాళ్లకి. అంకితా షాకి అంత అదృష్టంలేదు. పుట్టి ఏడాది అయిందో లేదో పోలియో మహమ్మారి వెంటాడింది. దీంతో కుడి కాలు తీసేయాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రారంభమైంది ఆమె ఒంటరి పోరాటం. ఒంటి కాలి జీవితం. ఏడుగురు సభ్యులు గల కుటుంబంలో ఈమే పెద్దది. పేరెంట్స్ ప్రోత్సాహంతో ఎకనమిక్స్ లో డిగ్రీ వరకూ చదివినా అంగ వైకల్యం కారణంగా ఎవరూ పెద్ద ఉద్యోగం ఇవ్వలేదు. అందువల్ల బతుకు దెరువు కోసం ఆమె చెయ్యని పనంటూలేదు. చివరికి ఒక హోటల్ లో హౌజ్ కీపింగ్ కూడా చేసింది. ఇంతలో (రెండేళ్ల కిందట) తండ్రి అనారోగ్యం బారినపడ్డారు.
పోలియో వల్ల పసితనంలోనే ఒక కష్టాల మలుపు తిరిగిన అంకితా షా జీవితం తండ్రి అనారోగ్యంతో మరో అష్టకష్టాల మలుపు తిరిగింది. తండ్రిని రోజూ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఉద్యోగంలో మరిన్ని సెలవులు దొరకవు కదా. అందుకే అంకితా షా ఒక ఆలోచన చేసింది. డ్రైవింగ్ నేర్చుకుంది. తనకి ఒక్క కాలు మాత్రమే ఉండటం వల్ల చేతులతో ఆపరేట్ చేసే ఆటో కొన్నది. తండ్రిని హాస్పిటల్ లో చూపించి, ఇంటి దగ్గర దింపి, తర్వాత కిరాయికి వెళుతుంది. అలా రోజుకి పది గంటలకు పైగా కష్టపడుతోంది. సొంత ఆటో కాబట్టి సమయం తన చేతిలోనే ఉంటుంది. క్యాబ్ సర్వీసూ అందిస్తోంది. దీంతో ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన డబ్బుల కన్నా ఇప్పుడే ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం అంకితా షా జీవితం సాఫీగానే సాగుతోంది. ఆమెది గుజరాత్. స్వగ్రామం పాలిటానా. అక్కడి నుంచి ఎప్పుడో అహ్మదాబాద్ కి చేరుకొని ఇప్పుడు చాంద్ ఖేడా నుంచి కాలుపూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆటో నడుపుతోంది. తన కుటుంబాన్ని తానే ముందుండి నడిపిస్తోంది. భగవంతుడు తన విషయంలో పొరపాటు చేసినా స్వశక్తితో నిలదొక్కుకుంది. అంకితా షా తన జీవితాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తోంది.