Mermaid: ‘సాహసవీరుడు సాగరకన్య‘ సినిమా గురించి అందరికీ తెలసిందే. హిట్టు సినిమా. వెంకటేష్, శిల్పా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. జల కన్య అదేనండీ, సాగర కన్యగా శిల్పా శెట్టి అందం అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది ఈ సినిమాలో. అయితే, ఇది రీల్ సంగతి అనుకోండి. రియల్ లోకి వచ్చేద్దాం. నిజంగానే జలకన్యలున్నాయా.? ఇంగ్గీషులో మెర్మైడ్స్ అని పిలిచే ఈ సాగర కన్యలను చూశామంటూ చరిత్రలో కొందరు చెప్పుకొచ్చారు.
సముద్రపు లోతుల్లో వేటకు వెళ్లేవారు, ఓడలలో సముద్రపు యానం చేసేవాళ్లు అప్పుడప్పుడూ జలకన్యలను చూశామంటూ కొన్ని కథలు చెప్పుకొచ్చారు. మరికొందరయితే, అసలు జలకన్యలు లేవని వాదించారు. అయితే, మన పురాణాల్లో జలకన్యల ప్రస్థావన ఉంది. కొందరు కవులు, చిత్ర కారులు జలకన్యల గురించి అక్కడక్కడా ప్రస్థావించారు. నిజంగానే జలకన్యలున్నాయా.? లేవా.? అది తెలియాలంటే, మన పురాణాల్లో చెప్పుకున్న కథలే కాదు, చరిత్ర చెప్పిన కొన్ని కథలను కూడా వినాల్సిందే.
ప్రపంచ విజేత అలెగ్జాండర్ సోదరి జలకన్యగా మారిందా.?
గ్రీకు నాగరికతకు సంబంధించి అలెగ్జాండర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని జయించి, ప్రపంచ విజేతగా చరిత్రలో నిలిచిపోవాలని తాపత్రయ పడిన రాజు అలెగ్జాండర్ గురించి చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. ఈయనకు ఓ చెల్లెలుంుడేదట. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు, అన్నయ్య అలెగ్జాండర్ అంటే చాలా ఇష్టం ఆమెకు. అన్న కోరిక నెరవేరాలని ఎప్పుడూ కోరుకునేది. అయితే, ప్రపంచ యుద్దంలో అలెగ్జాండర్ చనిపోతాడని తెలిసిన ఆమె, అన్న కన్నా ముందే తాను చనిపోవాలని సముద్రంలో దూకేసిందట. అన్నయ్య కోసం అప్పటికే స్వచ్చమైన మనసుతో దైవారాధన చేసేదట. దాంతో ఆమె చనిపోయి కొన్నాళ్లకు జలకన్యగా మారిందని చెబుతారు. అలా జలకన్యగా మారిన ఆమె అప్పుడప్పుడూ సముద్రంపై వేటకు వచ్చిన జాలరుల పడవలనూ, వర్తకానికి వచ్చిన వర్తకుల ఓడలనూ అడ్డగించేదట. తన అన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడా.? అని వారిని ప్రశ్నించేదట. ఆ ప్రశ్నకు అవును అని సమాధానం చెప్పిన వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చి వదిలి పెట్టేదట. లేదని సమాధానం వస్తే, అక్కడే వారి ఓడలను ముంచేసేదట. అన్నపై ఆమెకున్న ప్రేమతో జలకన్యగా సాగరంలో చాలా ఏళ్లు ఆమె జీవించి ఉందని చెబుతారు. అయితే ఇది ఓ కట్టుకథ మాత్రమే, అందుకు సాక్ష్యాధారాలు లేవని కొందరు వాదిస్తారు. అంతేకాదు, గ్రీకులు తమ చరిత్రలో ఓ చేపదేవుడున్నాడనీ అంటారు. ఆ చేప దేవుడి శిల్పం కూడా ఆధారంగా చూపిస్తారు.
భారతీయ పురాణాల విషయానికి వస్తే,
మత్స్యావతారంలో విష్ణువు జల రాక్షస సంహారం..
దశావతారాల్లో ఒకటిగా చెప్పబడే విష్ణు మూర్తి మత్స్యావతారం అందరికీ తెలిసిందే. ఓ రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి తలరాతల గ్రంధాలను దొంగిలించి, సముద్రపు అడుగు భాగానికి వెళ్లి దాక్కున్నాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు విష్ణువు సాయం కోరగా, సగ భాగం మనిషి, సగభాగం చేప ఆకారం పోలిన రూపంలో సముద్రపు అడుగు భాగాన ఉన్న ఆ రాక్షసుడిని సంహరించి, బ్రహ్మ తలరాతల గ్రంధాల్నీ పట్టుకొచ్చాడట. అలా విష్ణు మూర్తి మత్స్యావతారానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
అంతేకాదు, మన పురాణాల్లో, ప్రాచీన శిల్పాల్లో మత్స్య కన్యల బొమ్మలను చాలానే చూస్తుంటాం. అంటే, మన భారతీయ పురాణాల ప్రకారం నిజంగానే మత్స్య కన్యలు, అంటే జల కన్యలు ఉన్నాయని నమ్మాలేమో. పురావస్తు శాఖ కూడా జల కన్యల అలికిడిని నిరూపిస్తోంది. అంతేకాదు, ప్రముఖ చరిత్ర కారుడు క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రయానంలో భాగంగా ఓ దీవిలో ముగ్గురు జలకన్యలను చూశాననీ, కానీ, మనం చెప్పుకున్నట్లు అవి ఏమంత సుందర రూపంలో లేవనీ ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
మరిన్ని ప్రాచీన కథల ప్రకారం జలకన్యలు సముద్రపు వర్తకుల్ని అడ్డగించి వాటికి నచ్చిన బంగారు ఆభరణాలనూ, అందమైన మనుషులను అపహరించి, సముద్రపు అడుగు భాగానికి తీసుకెళ్తుంటాయనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే, పురాణ గాధలూ, పుస్తకాల్లో కథనాలు, శిల్పులు, చిత్రకారుల ప్రతిభ తప్ప, ప్రత్యక్షంగా జలకన్యలకు సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని శాస్త్రం చెబుతోంది.