Jawan : పుట్టిన రోజు వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. కొందరు దానాలు చేస్తారు. కొందరు పెద్దఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. బంధుమిత్రులకు పార్టీ ఇస్తారు. కానీ ఓ సైనికుడు ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ ని ఛేదించటం ద్వారా తన బర్త్ డేని మెమొరబుల్ గా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని పేరు నాయక్ పి వేలు. అతనొక జవాన్. పదేళ్ల కిందట సైన్యంలో చేరాడు. అతని హోదా నర్సింగ్ అసిస్టెంట్. స్వస్థలం తమిళనాడులోని కృష్ణగిరి. 13 ఏళ్ల వయసులోనే అథ్లెట్ గా తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. లాంగ్ మారథాన్ లలో ఇండియన్ ఆర్మీ తరఫున ఎన్నో పతకాలు సాధించాడు. 2020 జూన్ లో 1,600 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజుల్లోనే (అంటే రోజుకి సగటున 100 కిలోమీటర్లు) పరుగెత్తి ఆసియా ఖండం స్థాయిలో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఆసియా ఖండం లెవల్లో తన పేరిటే లిఖించుకున్న ఈ సరికొత్త చరిత్రను నాయక్ పి వేలు ఇన్ స్పిరేషన్ గా తీసుకొని మరో ఉన్నత లక్ష్యాన్ని స్వయంగా నిర్దేశించుకున్నాడు. 4,300 కిలోమీటర్ల దూరంలోని ఆ టార్గెట్ ని అందుకునేందుకు మొన్న శుక్రవారం (ఏప్రిల్ రెండో తేదీన) రన్నింగ్ మొదలుపెట్టాడు. శ్రీనగర్ లోని ఆర్మీ హాస్పిటల్ దగ్గర ప్రారంభమైన ఆ మెగా, గ్రాండ్ మారథాన్ ని 50 రోజుల్లో(మే 21వ తేదీ నాటికి) తమిళనాడులోని కన్యాకుమారి వద్ద కంప్లీట్ చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. ఆ రోజు అతని 30వ జన్మదినం. మొదటి రోజు కొంతమంది అతనికి తోడుగా ఐదు కిలోమీటర్ల వరకు కలిసి పరుగెత్తారు.
jawan-soldair-naik-p-velu-target-guinness-book-record
నాయక్ పి వేలు తొలి రోజు 200 కిలోమీటర్లు పరుగెత్తాడు. శనివారం ఉదయానికి ఉధంపూర్ కి, అక్కడి నుంచి జమ్మూకి వచ్చాడు. అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే రోజుకి కనీసం 70 నుంచి 100 కిలో మీటర్ల దూరం రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలను ఇండియన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) లెఫ్టినెంట్ కల్నల్ అభినవ్ నవజీత్ తెలిపారు. ఈ బహదూరపు పరుగు ప్రయాణంలో నాయక్ పి వేలు దిగ్విజయం సాధించాలని దేశ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అతను ఆశిస్తున్న గిన్నిస్ బుక్ రికార్డు వరించి తీరుతుందని ఆకాంక్షిస్తున్నారు. సాధించిన విజయాలతోనే సంతృప్తి పడకుండా మరిన్ని శిఖరాల వైపుకు దూసుకెళ్లేలా నాయక్ పి వేలు పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.