LaMDA: గూగుల్ సంస్థ సరికొత్త టెక్నాలజీని అందులోకి తేనుంది. ఆ టెక్నాలజీతో ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, కార్లు తదితర వాయిస్ సపోర్ట్ డివైజ్ లు మనుషుల్లా మాట్లాడతాయి. ఈ సాంకేతికతకి ప్రస్తుతానికి ల్యామ్డా (LaMDA) అనే షార్ట్ కట్ పేరు పెట్టారు. పూర్తి పేరు ‘లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్’. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చటం ద్వారా దీన్ని సుసాధ్యం చేయనున్నారు. ఇది కార్యరూపం దాల్చితే మెషీన్లు ఫ్రెండ్స్ లాగా ఆసక్తికరమైన బాతాఖానీ పెడతాయి. మనతో ఎంత సేపు కావాలంటే అంతసేపు మాట్లాడతాయి. చిన్న చిట్ చాట్ కాస్తా పెద్ద డిష్కషన్ లా కంటిన్యూ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, వాయిస్ సెర్చ్ లో.. అడిగిన ప్రశ్నకి మాత్రమే ఆన్సర్ లభిస్తుంది. కానీ ఇందులో అట్లా కాదు. మనం ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానమిచ్చి అక్కడే ఆగిపోకుండా తర్వాత అడగబోయే ప్రశ్నలను ఆ మెషినే ఊహించి మనతో చర్చని ముందుకు తీసుకెళుతుంది.
ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం గూగుల్ అసిస్టెంట్ ని ‘‘ఇవాళ సిటీలో వాతావరణం ఎలా ఉంది?’’ అని అడిగితే దానికి ‘‘ఎండగా ఉంది. టెంపరేచర్ 35 డిగ్రీల సెల్సియస్. తేమ శాతం 65’’ అని క్లుప్తంగా చెప్పి ఊరుకుంటుంది. అదే ల్యామ్డా టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ‘‘నగర వాతావరణం వేడిగా ఉంది. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లటం మర్చిపోవద్దు. వాతావరణం సాయంత్రానికి కాస్త చల్లబడుతుంది. కాబట్టి మీరు మీ ఫేవరెట్ ప్లేస్ కి వెళ్లి బీరుతో ఎంజాయ్ చేయొచ్చు. దగ్గరలోనే సినిమా థియేటర్ కూడా ఉంది. అక్కడ ఫలానా మూవీ ఆడుతోంది. టైమ్ పాస్ కోసం వెళ్లొచ్చు’’.. అంటూ మనకు నచ్చిన అంశాలని ప్రస్తావిస్తుంది. తద్వారా డిష్కషన్ ని పెంచుతుంది.
ల్యామ్డా టెక్నాలజీ వెనక ఉన్న రసహ్యం ‘‘ట్రెయిన్డ్ ఆన్ డైలాగ్’’. ‘‘ల్యామ్డా అసిస్టెడ్ వాయిస్ ఏఐ’’కి ముందుగా ఇచ్చే ట్రైనింగులో ఒక పదానికి, దాంతో సంబంధం ఉన్న ఇంకో పదానికి మధ్య రిలేషన్ ని వివరిస్తారు. దీంతో అది ఆలోచించి మరీ మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత ఆలోచించదు.