Love is Forever : ఏ ఇంట్లో అయినా, ఏ కుటుంబంలో అయినా అమ్మ స్థానం అగ్ర పీఠం. ఆమె బతికుండగా ఆ శిఖరాన్ని అందుకోవటం ఎవరికైనా అసాధ్యం. ఇంట్లో అమ్మ ఉంటే అందరికీ అన్నీ ఉన్నట్లే. ఆమె లేకపోతే ఎవరికీ ఏమీ లేనట్లే. దేవుడు సైతం కోరిన దీవెన అమ్మ అని ఒక సినీ రచయిత ఓ పాటలో రాశాడు. దైవం తర్వాత దైవం తల్లే కాబట్టి ఇంట్లో ఉండే ఎవరైనా నిత్యం అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. అలాంటి అమ్మను ఆ దేవుడు అర్ధంతరంగా, భౌతికంగా తీసుకెళితే ఆ ఇల్లు ఒక నరకం. ఎన్నేళ్లయినా ఆ లోటు అలాగే ఉండిపోతుంది. మరీ ముఖ్యంగా నాన్నకి.
అమ్మానాన్న కాలేజీమేట్స్. ఒకరినొకరు అర్థంచేసుకున్నారు. కొన్నాళ్లకు పెళ్లిచేసుకున్నారు. చూడముచ్చటైన జంట. అందరూ వాళ్లని అలా చూపుతిప్పుకోకుండా చూస్తుంటే దిష్టి తగులుతుందేమో అనిపించేది. నా అనుమానం నిజమైంది. భగవంతుడికే కన్నుకుట్టింది. అమ్మని క్రమంగా అనారోగ్యం పలకరించింది. చివరికి అదో వదలని భూతంలా వెంటాడింది. అమ్మని తీసుకెళ్లేదాక అది నిద్రపోలేదు. ఏడేళ్ల కిందట ఘోరం జరిగిపోయింది. అమ్మ శాశ్వతంగా దూరమైంది. దీంతో మమ్మల్ని సర్వం కోల్పోయిన ఫీలింగ్ చుట్టుముట్టింది. సంతోషం లేదు. సంబరం లేదు. నాన్న రెండు మూడేళ్ల పాటు అసలు మనిషే కాలేకపోయాడు.
Love is Forever : my father again married
అమ్మని మర్చిపోవటం బ్రహ్మకైనా కష్టమే. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నగా కాలేజీకి వెళ్లటం మొదలుపెట్టాను. అయినా మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ తో కలవలేకపోయా. అది గమనించిన నా దోస్తులు నన్ను మామూలు స్థితికి తేవటానికి ఎంతగానో ప్రయత్నించారు. నాన్న పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. మమ్మల్ని వాళ్ల సొంత కుటుంబ సభ్యుల్లా భావించారు. నాలాగే నాన్నకు కూడా నర్సరీ క్లాసుల నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉండేవారు. నిజమైన స్నేహితులకు ఉదాహరణగా వాళ్లని చూపించొచ్చు. అమ్మకి అలా అయిందని తెలిసి ఆమె రోజూ ఇంటికి వచ్చిపోతుండేవారు. రెండు మూడేళ్లు మాపై అమూల్యమైన, నిస్వార్థమైన ప్రేమ కురిపించారు. మా కుటుంబానికి పూర్వపు స్థితిని తీసుకురావటానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
మా నాన్న, ఆయన ఫ్రెండ్ కుటుంబం ఒకప్పుడు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఇద్దరికీ పెళ్లయ్యాక వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మా నాన్న స్నేహితురాలు చూడటానికి ఎంత బాగుంటారో ఆమె మనసు కూడా అంత అందమైనది. కానీ.. దురదృష్టవశాత్తూ మా నాన్న ఫ్రెండ్ వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. విడిపోయారు. ఆదర్శవంతంగా మెలిగే ఈ స్నేహితులిద్దరికీ ఇప్పుడు మానసికంగా, వ్యక్తిగతంగా తోడు అవసరం. భావోద్వేగాలను పంచుకునే బంధం కావాలి. మా నాన్న మళ్లీ హ్యాపీ లైఫ్ సొంతం చేసుకోవాలని కోరుకున్నా. ఇద్దరి జీవితాల్లోనూ సంతృప్తిని సగంలోనే తుంచేసిన ఆ దైవం ఎట్టకేలకు వాళ్లకొక దారిచూపింది. మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మాకు మరో అమ్మని ఇచ్చారు. (ఇది ఓ యువతి జీవితంలో జరిగిన సంఘటన).