Marriage : కట్నకానుకలు పూర్తిగా ఇవ్వలేదనే వంకతో ఆఖరి నిమిషంలో ఆగిపోయే పెళ్లిళ్లు ఉన్నాయి. చివరి గడియలో వరుణ్ని మార్చారనే కోపంతో తాళి కట్టించుకునేందుకు నిరాకరించిన వధువులను చూశాం. పీటల మీద నుంచి లేచిపోయిన పెళ్లి కొడుకుల గురించి, పెళ్లి కూతుళ్ల గురించి అప్పుడప్పుడూ వార్తలు వస్తున్నాయి. ఇలా రకరకాల కారణాలతో మూడు ముళ్లూ పడకముందే మనువులు పెటాకులవటం ప్రస్తుత సమాజంలో సహజంగా మారిపోయింది. ఇవేవీ కాకుండా విచిత్రమైన కారణంతో వివాహం నిలిచిపోవటం లేటెస్టు న్యూస్.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చెరిలో కరైకల్ అనే జిల్లా ఒకటి ఉంది. ఆ జిల్లాలోని జాలరి గ్రామాల ప్రజలు సరికొత్త డిమండ్ ని తెరపైకి తెచ్చారు. పెళ్లి కొడుకు గడ్డంతో ఉంటే ఆ పెళ్లికి మేం రాం అంటూ తేల్చిచెప్పారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. వివాహానికి రాబోం అని చెప్పటమే కాకుండా ఆ వివాహాల్ని బహిష్కరించాలనే కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. పెళ్లికొడుకు గడ్డం చేయించుకోకుండా పెళ్లిపీటలెక్కటం తమ ఆచారానికి విరుద్ధమని చెబుతున్నారు. సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఒకటికి రెండు సార్లు చెప్పి చూశాం. అయినా వాళ్లు మారకపోయేసరికి చేసేదేమీ లేక ఈ దిశగా అడుగులు వేశామని కరైకల్ మేడు జాలరి గ్రామ పెద్ద తంగిడివేల్ పేర్కొన్నారు.
Marriage : we don‘t attend marriage if groom have not get shaved
గడ్డం చేయించుకుంటే మొహం నీట్ గా కనిపిస్తుంది. అందంగా ఉంటారు. ఒకప్పుడు ఎక్కువ మంది ఇదే స్టైల్ ని ఫాలో అయ్యేవాళ్లు. మిగతా సమయాల్లో ఎట్లా ఉన్నా పెళ్లికి మాత్రం తప్పకుండా షేవింగ్ చేయించుకొని టిప్ టాప్ గా తయారయ్యేవారు. లేకపోతే పెద్దలు ఊరుకునేవారుకాదు. ‘‘ఏరా.. నీకు ఇప్పుడు కూడా గడ్డం చేయించుకోవటానికి తీరలేదా’’ అని కాస్త వెటకారంగా, ఇంకాస్త కోపంగా ప్రశ్నించేవారు. అప్పటికప్పుడు బార్బర్ ని పిలిపించి మరీ గడ్డం చేయించేవాళ్లు. కానీ.. రాన్రానూ ఈ మంచి అలవాటు మారిపోయింది. సినిమాల్లో హీరోలు ఫ్యాషన్ కోసం చూపిస్తున్నారో లేక మరే కారణం చేతనో ఇప్పుడు ప్రతిఒక్కరూ అవసరం ఉన్నా లేకున్నా గడ్డం పెంచుతున్నారు. వాళ్ల వైపు చూడాలంటేనే అసహ్యం అనిపించేలా చేస్తున్నారు. అర్థంపర్థంలేని ఈ ట్రెండ్ కి ఎట్టకేలకు పుదుచ్చెరి ప్రజలు బ్రేక్ వేసి సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.