Deepika: దీపికా సింగ్.. హిందీ బుల్లితెర నటి. మంచి డ్యాన్సర్. ‘ఈతరం ఇల్లాలు’ అనే డబ్బింగ్ సీరియల్ తో తెలుగులో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందమైన టీవీ హీరోయిన్లలో ఆమె ఒకరు. అయితే మూడు రోజుల కిందట దీపికా సింగ్ చేసిన ఒక పనితో నెటిజన్లు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చేయాల్సిన పని ఇది కాదు అంటూ క్లాస్ తీసుకుంటున్నారు. దీంతో ఆమె ‘‘నా ఉద్దేశం అది కాదు’’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదని అంటున్నారు.
తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో తుఫాన్ కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు భారీగా ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో పెద్ద పెద్ద చెట్లు నేలకూలుతున్నాయి. ముంబైలోని దీపికా సింగ్ ఇంటి వద్ద కూడా ఒక చెట్టు నెలకొరిగింది. అప్పుడు ఆమె బయటకు వచ్చి ఆ చెట్టు దగ్గర డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను, వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. ప్రస్తుతం సినిమా, సీరియల్, టీవీ ప్రోగ్రామ్స్ షూటింగులు లేకపోవటంతో దీపికా సింగ్ ఆన్ లైన్ లో డ్యాన్స్ క్లాసులు నిర్వహిస్తూ రోజూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిని కూడా అప్ లోడ్ చేశారు. దీంతో వాటిని చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. తుఫాన్ వల్ల అవతల జనం చస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా?. ఇది సిగ్గుచేటు అంటూ ఘాటుగా స్పందించారు. ‘‘ఈతరం ఇల్లాలు’’ చేయాల్సిన పని ఇది కాదంటూ హెచ్చరించారు. దీంతో దీపికా సింగ్ రియాక్ట్ అయ్యారు.
‘‘నిజానికి మేము రోడ్డు మీద పడ్డ ఆ చెట్టును తొలగిద్దామని బయటికి వచ్చాం. కానీ మా ఆయన మంచి ఫొటోగ్రాఫర్ కావటంతో ఈ తుఫాన్ కి, ఆ కూలిపోయిన చెట్టుకి గుర్తుగా ఫొటోలు, వీడియో తీస్తాననటంతో కాదనలేకపోయా. అంతేతప్ప ఇబ్బందుల్లో ఉన్న జనాన్ని హేళన చేయాలనేది నా ఉద్దేశం కాదు’’ అని లెంపలేసుకున్నారు. టీవీ షోలు చేసేవాళ్లకి సినిమాల మీద సీరియస్ నెస్ ఉండదనే అభిప్రాయం నేపథ్యంలో తాను ఆ కార్యక్రమాలకు ఒప్పుకోవట్లేదని చెప్పారు. ఓ మూవీలో నటించానని, వివరాలు ఇప్పుడే వెల్లడించదలచుకోలేదని దీపికా సింగ్ అన్నారు.