vodafone-idea : భారతీ ఎయిర్ టెల్ బాటలో వొడాఫోన్-ఐడియా కూడా నడుస్తోంది. కరోనా నేపథ్యంలో అల్పాదాయ వర్గాల వినియోగదారులకు రూ.49 రీఛార్జ్ ప్లాన్ ని ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్ టెల్ మొన్న ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఐడియా కూడా అంతే మొత్తంలో ఫ్రీగా రీఛార్జ్ చేయనున్నట్లు ఇవాళ మంగళవారం వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎయిర్ టెల్ నిర్ణయం వల్ల ఐదున్నర కోట్ల మంది మాత్రమే ప్రయోజనం పొందనుండగా ఐడియా తీసుకున్న నిర్ణయంతో ఆరు కోట్ల మంది పేద వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఎయిర్ టెల్ మాదిరిగానే ఐడియా కూడా ఈ ఉచిత ఆఫర్ తోపాటు రూ.79 పెట్టి రీఛార్జ్ చేయిస్తే డబుల్ టాక్ టైమ్ కాంబో ఓచర్ ని ప్రవేశ పెట్టింది.
vodafone-idea : vodafone-idea has followed airtel
వొడాఫోన్-ఐడియా ప్రకటించిన ఈ వన్ టైమ్ ఆఫర్ లో రూ.49 రీఛార్జ్ ప్యాక్ లో రూ.38 టాక్ టైమ్ తోపాటు 300 ఎంబీ డేటా కూడా వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. లోకల్/ఎస్టీడీ కాల్స్ కి సెకన్ కి పావలా వసూలు చేస్తారు. మామూలుగా రూ.79 రీఛార్జ్ తో రూ.64 టాక్ టైమ్, 200 ఎంబీ డేటా 28 రోజుల కాలపరిమితో ఇస్తారు. కానీ కొవిడ్ నేపథ్యంలో ప్రవేశపెట్టిన రూ.79 ప్లాన్ లో రూ.128 టాక్ టైమ్ లభిస్తుంది. మిగతావి సేమ్ టు సేమ్. యాప్, వెబ్ సైట్ ల ద్వారా రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 200 ఎంబీల డేటా వస్తుంది. రెండు పెద్ద టెలికం కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రూ.49 రీఛార్జ్ ని ఉచితంగా అందిస్తుండటంతో మిగతా సంస్థలు కూడా ఇదే మార్గంలో పయనిస్తాయని అంటున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో వంటి కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. వొడాఫోన్-ఐడియా ఆఫర్ వల్ల ఆ సంస్థకు రూ.294 కోట్లు ఖర్చు కానున్నాయి. మొత్తానికి ఎయిర్ టెల్, ఐడియా తమ కస్టమర్ల మనసు దోచాయని చెప్పొచ్చు.