Duty: ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వర్క్ ఫ్రం హోం’ అనే విధానానికి బదులు గూగుల్ సంస్థ మరో కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఇందులో భాగంగా వారంలోని ఏడు రోజుల్లో ఐదు రోజులే పని దినాలు కాగా వాటిలో మూడు రోజులు మాత్రమే ఆఫీసుకు వస్తే చాలని, మిగతా రెండు రోజులు మీ ఇష్టమంటూ తన ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చింది. ఆ మిగిలిన రెండు రోజుల్లో మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా అనిపిస్తే అక్కడే ఉండి పని చేయొచ్చని, అది ఆఫీసు కావొచ్చు, మీ ఇల్లు కావొచ్చు అని స్పష్టం చేసింది.
టెక్నాలజీ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ త్వరలో అమల్లోకి తేనున్న ఈ నయా కార్పొరేట్ ట్రెండ్ ని ‘‘హైబ్రిడ్ వర్క్ వీక్’’ అంటారు. ఈ కల్చర్ లో ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది వర్క్ ఫ్రం హోం చేయొచ్చని, 60 శాతం మంది ఆఫీసుకు వస్తారని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ‘‘ప్రొడక్షన్ ఏరియాలను, కంపెనీ యాక్టివిటీస్ ని బట్టి ఎంప్లాయ్స్ ఏయే రోజుల్లో కలిసి పనిచేయాలో నిర్ణయిస్తాం. కొంత మంది ఉద్యోగులకు పూర్తిగా రిమోట్ ద్వారా విధులకు హాజరయ్యే ఛాన్స్ కూడా కల్పిస్తాం. టీమ్ ను బట్టి, అందులో ఆ ఉద్యోగి చేయాల్సిన పనిని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి’’ అని సుందర్ పిచాయ్ వివరించారు.
గూగుల్ సంస్థలో వరల్డ్ వైడ్ గా మొత్తం లక్షా 40 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు లేటెస్ట్ డేటా చెబుతోంది. అయితే.. అందులో ఎంతెంత మంది ఏయే దేశాల్లో పని చేస్తున్నారో తెలియదు. ఇండియాలో దాదాపు నాలుగు వేల మంది ఉండొచ్చని అంటున్నారు. సెర్చ్, క్లౌడ్, పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) రీసెర్చ్ తదితర సెక్షన్లలో మనోళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. భారత్ లో ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ ఎంప్లాయ్స్ డ్యూటీకి వెళుతున్నారని తెలుస్తోంది.