Wife: వైఫ్ అంటే వైఫ్ (భార్య) మాత్రమే కాదు. నైఫ్ (కత్తి) అని కూడా వెనకటికి ఎవరో అన్నారు. జోక్ గా అన్నారో సీరియస్ గా అన్నారో తెలియదు. మనకు మాత్రం ఈ మాట వినగానే జోక్ అనిస్తుంది. నవ్వొస్తుంది. ఇంకో విషయం తెలిస్తే అది మరీ కామెడీ అనుకుంటారు. కానీ అది కామెడీ కాదని ట్రాజెడీ అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ ఆ సంగతి ఏంటంటే.. భార్యను కంట్రోల్ లో పెట్టడం ఎలాగో తెలియక కోటానుకోట్ల మంది పురుష పుంగవులు గుబులుతో గూగుల్ తల్లి సాయం కోరారంట. మూడో కంటోడికి తెలియకుండా పెళ్లాన్ని కొట్టడం ఎలాగో చెప్పు మాతా అని కూడా దీనంగా వేడుకున్నారంట. వీటికి ఆ అమ్మ ఏం చెప్పిందో తెలియదు.
ప్రపంచంలో గతేడాది నుంచి ప్రతి విపరీత పరిణామానికీ కరోనా వైరస్సే కారణం అవుతోంది కదా. ఈ పాపానికి కూడా ఆ మహమ్మారే ఒడికట్టిందంట. పోయిన సంవత్సరం విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో కొవిడ్-19 వల్ల లాక్డౌన్లు పెట్టారు. దీంతో మొగుడూ పెళ్లాలు నెలల తరబడి ఇంట్లోనే కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయింది. ఫలితంగా వాళ్లల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, గృహ హింస పెరిగిందని అధ్యయనాలు అఘోరిస్తున్నాయి. ఇదే సమయంలో జనం ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్లకి, సిస్టమ్స్ కి, ల్యాప్ టాప్ లకి అతుకుపోయారు. టైం పాస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఇంటర్నెట్ ని ఆశ్రయించారు. కాబట్టి గూగుల్ లో ఏయే అంశాలను సెర్చ్ చేశారో తెలుసుకుందాం అని ఒక సంస్థ స్టడీ చేయగా ఈ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.
‘భార్యను అదుపులో పెట్టడం ఎలా’ అనే ప్రశ్నకి సమాధానం కోసం 2020లో 16 కోట్ల 50 లక్షల సార్లు వెతికారట. ఎవరికీ తెలియకుండా భార్యపై చెయ్యి చేసుకోవటం ఎలా అనే ప్రశ్నకి కూడా 16 కోట్ల 50 లక్షల సార్లు సెర్చ్ చేయటం గమనార్హం. ఈ సంగతులు ఆలస్యంగా తెలిశాయి. దీంతో భార్యలు ఇక జాగ్రత్తపడతారో? (లేక) భర్తలపై మరింత వేధింపులకు పాల్పడతారో చూడాలి. ఈ కథ ఇంకా కంచికి చేరలేదు. కారణం.. కొవిడ్ సెకండ్ వేవ్ రెచ్చిపోతుండటం. మరోసారి లాక్డౌన్లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండటం. 2021లో మగ మహానుభావులు ఇంకే ప్రశ్నలకి సమాధానాల కోసం గూగుల్ మదర్ ని గుచ్చి గుచ్చి అడుగుతారో?..