Kamal Kishore Mandal : చదువుకు పేదరికం అడ్డు కాదు. ఉన్నత చదువులు చదువుకుని మంచి పొజిషన్ లో ఉండాలనే ఆశ ఉండాలే కానీ.. దాన్ని అందుకోవాలనే పట్టుదల ఉండాలే కానీ ఏమైనా సాధించొచ్చు. దీన్ని చేసి చూపించాడో వ్యక్తి. ఓ వైపు ఉదయం కాలేజికి వెళ్లి.. మధ్యాహ్నం పనికి వెళ్లి.. రాత్రి పూట చదువుకోవడమంటే చాలా గొప్ప విషయం. చివరకు అనుకున్నది సాధించాడు.అటెండర్ గా పనిచేసిన వ్యక్తి అదే కాలేజికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి కథ తెలుసుకుందాం.
బిహార్ భాగల్ పుర్ ముండిచక్ కు చెందిన కమల్ కిషోర్ మండల్ కు చదువంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితుల వల చదువు మానేసి నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. 42 ఏళ్లున్న కిషోర్ కు 2003లో ముంగేర్ కాలేజీలో వాచ్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 2008లో అక్కడి నుంచి డిప్యూటేషన్ పై అంబేడ్కర్ పీజీ కళాశాలకు అంటెండర్ గా వెళ్లాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. పీజీ కళాశాలకు అంటెండర్ గా వెళ్లిన కిషోర్.. విద్యార్థులు, ఉపాధ్యాయులను చూసి చదువుపై మరింత ఆసక్తిని పెంచుకున్నాడు. 2013లో పీజీ పూర్తి చేశాడు. 2017లో పీహెచ్ డీలో పేరు నమోదు చేసుకున్నాడు. 2019లో పీహెచ్ డీ సైతం పూర్తి చేసి.. జాతీయ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు.
చివరకు 2020లో బిహార్ రాష్ట్ర విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్ నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 12 మందిని ఇంటర్వ్యూకు పిలవగా అందులో కిషోర్ ఒకరు. అన్ని దశలను దాటుకుని చివరకు తాను పని చేసిన అంబేడ్కర్ పీజీ కళాశాలలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.
దీంతో కిషోర్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఎంతో సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నానని కిషోర్ చెప్పాడు. అటు ఉద్యోగం చేస్తూ.. చదువుకుని ఈ ఉద్యోగం సాధించి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read : Rajamouli : బాలయ్య నుంచి పవన్ దాకా.. రాజమౌళి ఆఫర్‌ను వద్దన్న దురదృష్టవంతులు వీరే..!
Also Read : Work From Pub : వర్క్ ఫ్రమ్ హోం స్థానంలో వర్క్ ఫ్రమ్ పబ్.. ఉద్యోగులకు బంపరాఫర్