India పాకిస్థాన్ ఇండియాకి పొరుగు దేశం. ఎప్పుడూ పొగబెట్టే దేశం కూడా. సందు దొరికితే చాలు.. చైనా, బంగ్లాదేశ్ లతో కలిసి మనల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తుంటుంది. మధ్యలో అమెరికా సాయం కూడా తీసుకుంటూ ఉంటుంది. సరిహద్దుల్లో చొరబాట్లకు రోజూ ప్రయత్నం చేస్తుంది. మనోళ్లు ధీటుగా స్పందించే సరికి తోక ముడుస్తుంది. ఉగ్రవాదానికి, ఆర్థిక ఇబ్బందులకి, నిత్య మారణ హోమానికి కేరాఫ్ అడ్రస్ గా కూడా ఈ పాకిస్థాన్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి దేశం ఆశ్చర్యకరంగా మనకు సాయం చేసేందుకు సిద్ధం అంటూ ప్రకటించింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైద్య పరికరాలను అందించేందుకు అడగకుండానే ముందుకు వచ్చింది. వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్-రే మెషీన్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్లను ఇండియాకి పంపటానికి రెడీగా ఉన్నామని నిన్న శనివారం పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
I want to express our solidarity with the people of India as they battle a dangerous wave of COVID-19. Our prayers for a speedy recovery go to all those suffering from the pandemic in our neighbourhood & the world. We must fight this global challenge confronting humanity together
— Imran Khan (@ImranKhanPTI) April 24, 2021
‘‘కొవిడ్-19తో పోరాటం చేస్తున్న ఇండియాకి మా వంతుగా సంఘీభావం ప్రకటిస్తున్నాం. దీంతోపాటు ‘హ్యూమానిటీ ఫస్ట్’ అనే పాలసీలో భాగంగా పైన పేర్కొన్న వైద్య సామగ్రి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం. ఆయా మెడికల్ ఐటమ్స్ ని సాధ్యమైనంత తొందరగా భారత్ కి చేరవేసేందుకు రెండు దేశాల ఆఫీసర్లు ప్రయత్నం చేయాలి. అంతేకాదు. కరోనాపై పోరులో సాయం కోసం ఇతర మార్గాలని కూడా అన్వేషించాలి’’ అని షా మహమ్మద్ ఖురేషి సూచించారు. అంతకుముందు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఇండియాకి సంఘీభావం తెలిపారు. కంటికి కనిపించని మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారతీయులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో మనం తప్పకుండా విజయం సాధిస్తామని ఇమ్రాన్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ప్రకటనపై ఇండియా వైపు నుంచి స్పందన లేదు. ఆ దేశం అందిస్తానన్న సాయం వద్దు అని గానీ, స్వాగతిస్తున్నాం అని గానీ మనోళ్లు అనలేదు. బహుశా తీసుకునే ఉద్దేశం భారత్ కు లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్థాన్ కుటిల బుద్ధి గురించి ఇండియాకి బాగా తెలుసు. సాయం తీసుకుంటే రేపొద్దున ఎక్కడైనా మనల్ని దెప్పేసినా దెప్పేస్తుంది. దీనికితోడు శనివారం ఉదయమే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇండియాలోకి చొరబడటానికి ప్రయత్నించిన రెండు పాకిస్థాన్ డ్రోన్లను మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తరిమేసింది. ఒక వైపు సాయం అంటూ మరో వైపు దొంగచాటుగా భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించటం పాకిస్థాన్ రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతోంది.