Miss Universe: మిస్ యూనివర్స్-2020 కిరీటం మెక్సికో యువతి ఆండ్రియా మేజాని వరించింది. ఆ దేశానికి చెందినవారు ఈ టైటిల్ సాధించటం ఇది మూడోసారి. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన 26 ఏళ్ల ఆండ్రియా.. నిన్న ఆదివారం ఫ్లోరిడాలోని ఒక ప్రముఖ హోటల్ లో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీలో 73 మందితో పోటీ పడి మరీ విజేతగా నిలిచింది. దీంతో దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ జొజిబిని తుంజి.. ఆండ్రియాకి తాజా కిరీటాన్ని అలంకరించారు. ఇండియా నుంచి ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న అడిలైన్ క్యాస్టిలినో మూడో రన్నరప్ గా నిలిచారు.
అందానికి అసలు సిసలు క్రైటీరియా ఏంటి అన్న ప్రశ్నకు ‘‘మన ముఖంలో, మన శరీరంలో మాత్రమే కాదు. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుంది. కాబట్టి చూడటానికి చక్కగా లేమనో, డబ్బు లేదనో, మరో కారణం చేతనో ఎవరైనా మనల్ని తక్కువ చేసి చూస్తే అస్సలు ఒప్పుకోవద్దు’’ అంటూ ఆండ్రియా చెప్పిన సమాధానం మిస్ యూనివర్స్ పోటీల జడ్జిలకు నచ్చింది. అంతేకాదు. ఆమె.. సమాజంలో మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం కోసం పాటుపడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని న్యాయనిర్ణేతలు ఆండ్రియాను విశ్వ సుందరిగా సెలెక్ట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది జరగాల్సిన పోటీలు జరగలేదు. ఎట్టకేలకు నిన్న నిర్వహించారు. ఈ పోటీల్లో మయన్మార్ తరఫున పాల్గొన్న థజార్ వింట్ ల్విన్ తమ దేశంలో సైనిక పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అష్టకష్టాలను ఈ వేదిక మీద నుంచి ప్రపంచానికి తెలియజేశారు.
ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, రెండో రన్నరప్ గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. విజయానందంలో ఆండ్రియా మేజా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆనంద భాష్పాలను రాలుస్తూనే క్యాట్ వాక్ చేసింది. మేకప్ ఆర్టిస్ట్-కమ్-మోడల్ అయిన ఆండ్రియాకి ఆటలన్నా ఇష్టమే. జంతు ప్రేమికురాలు కూడా. నాన్ వెజ్ తినదు.