Kondagattu Hanuman Temple: ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా స్పెషలే. మిక్కిలి బలవంతుడు. కాబట్టి, తన బలాన్ని మనకు ప్రసాదిస్తాడనే నమ్మకం. ఆయనను పూజిస్తే, ఎలాంటి భయాలూ దరి చేరవని విశ్వాసం. అందుకే ఊరి పొలిమేర్లలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. రోడ్లకిరువైపులా, పెద్ద పెద్ద నిలువెత్తు హనుమంతుడు ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా హనుమంతుడి విగ్రహాలు తారసపడుతూనే ఉంటాయి. శ్రీ ఆంజనేయం. ప్రసన్నాంజనేయం అని స్మరిస్తే, ఎక్కడ లేని బలం పుంజుకొస్తుంది. శరీరమంతా తెలియని ధైర్యం ఆవహిస్తుంది. అలాంటి హనుమంతుడి మహిమలు ఎన్నని చెప్పగలం. అయితే ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన హనుమంతుడి దేవాలయం గురించి చెప్పుకుందాం.
మన తెలంగాణా రాష్ర్టంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయమిది. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు 15 కిమీల దూరంలో ముత్యం పేట అనే ఊరుంది. అక్కడే మనం చెప్పుకోబోయే కొండగట్టు వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఎలా వెలిశాడో.? ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సంజీవని పర్వతం జారవిడిచిన ప్రాంతం..
రామ రావణ యుద్ధంలో భాగంగా గాయ పడిన లక్షణుడిని రక్షించేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. అప్పుడు ఈ మార్గం గుండానే హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లాడట. అలా ఆ పర్వతం నుండి కొంత భాగం ఇక్కడ పడిందట. అది కాలక్రమంలో ఓ పెద్ద కొండలా మారిందట. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న కొండగట్టు.
స్వయంభు హనుమాన్..
ఈ కొండపైకి గొర్రెలను కాచుకోవడానికి వచ్చిన ఓ కుర్రవాడికి హనుమంతుడు మరో పిల్లవాడి రూపంలో కనిపించి, పలానా చోట హనుమంతుడి విగ్రహం ఉందని చెప్పగా, ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్టించారట. అలా స్వయంభువుగా స్వామి ఇక్కడ వెలిశాడన్న మాట.
విలక్షణమైన స్వామి రూపం..
ఈ ఆంజనేయ స్వామికి రెండు ముఖాలుంటాయి. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా, మరొకటి నరసింహా స్వామి ముఖం. అందుకే ఈ స్వామి చాలా పవర్ ఫుల్ అంటారు. ఇక స్వామి శంఖు చక్రాలను కలిగి ఉంటాడు. సీతారాములను తన భుజాలపై మోస్తూన్నట్లుగా కనిపిస్తాడు.
ఈ గుడి విశిష్టతలు..
ఆంజనేయ స్వామి గుడి వెనక బేతాలుని గుడి ఉంటుంది. అక్కడ జంతు బలులు ఇస్తుంటారు. కొండగట్టు హనుమంతుడి గుడి ఎదుట సీతమ్మ వారి కన్నీళ్ల జాడ కనిపిస్తుందని అంటారు. సంజీవని పర్వతం నుండి పడిన భాగం కాబట్టి, ఈ గట్టుకు చాలా విశిస్టత ఉంది. దీర్ఘ కాలిక రోగాలతో బాధపడేవారు ఒక్కసారి ఈ గట్టుపై కొలువైన స్వామిని దర్శిస్తే, వారి రోగాలు మాయమవుతాయట. అలాగే, భూత, ప్రేతాలతో బాధపడేవారిని స్వామి ఎదురుగా ఉన్న రావి చెట్టుకు కట్టేస్తే దెయ్యాల పీడ నుండి విముక్తులవుతారట. సంతానం కావల్సిన వాళ్లు స్వామిని 40 రోజులు పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. అయ్యప్ప మాలలా ఇక్కడి కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా భక్తితో మాలలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది.